‘ఎంసీఏ’ మినిమం 30 కోట్లు తేవాలి

ఈ ఏడాదిలో మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ఏడాది ఆరంభంలో ‘నేను లోకల్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. మధ్యలో ‘నిన్ను కోరి’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘నేను లోకల్’ ఏకంగా రూ.35 కోట్ల దాకా షేర్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని మార్కెట్ ను మరింతగా విస్తరించింది. ‘నిన్ను కోరి’ లాంటి క్లాస్ సినిమా సైతం రూ.25 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషమే. ఇది ‘ఎంసీఏ’ సినిమాకు బాగానే కలిసొచ్చింది. ఈ చిత్రానికి రూ.40 కోట్లకు పైగా బిజినెస్ కావడం విశేషం. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ వాల్యూ మాత్రమే రూ.30 కోట్లు కావడం విశేషం. శాటిలైట్.. డిజిటల్.. ఇతర హక్కులన్నీ కలిపి రూ.10 కోట్ల దాకా తేలినట్లు సమాచారం.

‘ఎంసీఏ’ సీడెడ్ హక్కుల్ని రూ.4 కోట్లకు.. వైజాగ్.. మిగతా ఆంధ్రా ఏరియాల హక్కుల్ని రూ.12 కోట్లకు అమ్మినట్లు సమాచారం. నైజాం ఏరియాలో దిల్ రాజే సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడి రైట్స్ వాల్యూ రూ.8.5 కోట్లని అంచనా. ఇక ఇండియాలోని మిగతా ప్రాంతాల హక్కుల రూ.2 కోట్లు.. ఓవర్సీస్ రైట్స్ రూ.3.5 కోట్లు పలికాయి. మొత్తంగా లెక్క రూ.30 కోట్లకు చేరింది. అంటే ఈ చిత్రం రూ.30 కోట్ల షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ కు వస్తుందన్నమాట. నైజాం దిల్ రాజు సొంత ఏరియా కాబట్టి దాన్ని తీసేస్తే.. మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.21.5 కోట్ల షేర్ రావాలి. నాని కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వస్తే రూ.30 కోట్ల షేర్ కష్టం కాకపోవచ్చు. ఐతే దీనికి పోటీగా ‘హలో’ వస్తుండటం కొంతమేర ప్రభావం చూపొచ్చు.

జనవరి 1న రాబోతున్న రానా

టాలీవుడ్ హీరో రానా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో. బాహుబలి విలన్ గా ఎంతగానో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన రానా.. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఒకే చిత్రాన్ని పలు భాషల్లో తెరకెక్కిస్తూ ప్రాజెక్టు దశలోనే సేఫ్ స్టేజ్ కి తెచ్చేస్తున్నాడు. ప్రస్తుతం 1945నాటి కథతో ఓ మూవీ చేస్తున్నాడు రానా. తమిళ్ డైరెక్టర్ ప్రభు సాల్మన్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై రీసెంట్ గానే అధికారిక ప్రకటన వచ్చింది.

వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ డేట్ చెప్పేశారు. షూటింగ్ జనవరిలో ప్రారంభం కానున్నా.. జనవరి 1నే అంటే న్యూఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ ఇచ్చేయనున్నారట. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం రానా కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలవడనుండగా.. రాజేష్ ఖన్నాకు ఈ చిత్రం ట్రిబ్యూట్ అంటున్నారు మేకర్స్. ఇందుకు కారణం.. 1971లో విడుదల అయిన హాథీ మేరా సాథీ చిత్రంలో రాజేష్ ఖన్నా పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడట.

ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు థాయ్ ల్యాండ్ లో కూడా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది దీపావళి నాటికి విడుదల చేసే టార్గెట్ డిసైడ్ చేసుకున్నారు. అలాగే ఘాజీ మాదిరిగానే ఈ పీరియాడిక్ మూవీకి కూడా చాలానే విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అవుతాయని తెలుస్తోంది.

‘గాయత్రి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఒకప్పుడు టాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా కొనసాగిన మోహన్ బాబు ఆ తర్వాత స్పెషల్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి అయన కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేస్తున్నారు. ఇక రెండేళ్ల క్రితం సినిమాలను చేయడం లేదని మోహన్ బాబు చెప్పినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా అయన రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గాయత్రి అనే సినిమాను చేస్తున్నాడు.

రాజకీయ నేపథ్యంలో సాగనున్న ఈ కథను మదన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో మంచి కథాంశం ఉండడంతో మోహన్ బాబు ఎంతో ఇష్టంగా సినిమాను ఒప్పుకున్నారట. సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్స్ కి చిత్ర యూనిట్ చెక్ పెట్టింది.

సినిమాను ఫైనల్ గా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషయల్ ఎనౌన్సమెంట్ ఇచ్చేశారు. ఇక సినిమాలో మోహన్ బాబు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను మంచు విష్ణు చేయబోతున్నాడు. శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిలా విమలా టైటిల్ రోల్ క్యారెక్టర్ లో అలరించనుంది. బ్రహ్మానందం – అనసూయ భరద్వాజ్ వంటి నటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

రంగస్థలం ఫస్ట్ లుక్ రేపే రిలీజ్

ధృవ సినిమాతో హిట్టు కొట్టి దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా విషయంలో మాత్రం చాలా ఆలస్యం చేశాడనే చెప్పాలి. అయినా చరణ్ ఎంచుకున్న రంగస్థలం 1985 కథ కూడా అలాంటిది. పైగా సుకుమార్ దర్శకుడు. మధ్య మధ్యలో సైరా లాంచ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అలాగే సమంత పెళ్లి వల్ల కొంచెం షూటింగ్ ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ గా షూటింగ్ ప్రస్తుతం చాలా స్పీడ్ గా సాగుతోంది.

ఇక అసలు పనులు కూడా ఇక్కడి నుంచే మొదలవ్వనున్నాయి. అదే ప్రమోషన్స్ కార్యక్రమాలు. సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసి చాలా కాలమే అవుతోంది. ఇంతవరకు ఫస్ట్ లుక్ లేదు. కానీ మధ్య మధ్యలో సినిమా కోసం వేసిన సెట్స్ ఫొటోస్ ని రిలీజ్ చేస్తూ.. చిత్ర యూనిట్ కొంచెం భాగనే హైప్ క్రియేట్ చేసింది. ఇక రేపటి నుంచి సినిమా రేంజ్ మరింత పెరగనుందని చెప్పవచ్చు. ఎందుకంటే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది. డిసెంబర్ 8న శుక్రవారం నాడు ఉదయం 5:30గంటలకు రంగస్థలం ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ అయ్యింది.

మెగా అభిమానులు ఫస్ట్ లుక్ కోసం చాలానే ఎదురుచూస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ లుక్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇంతకుముందే నెట్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ క్లారిటీగా చూస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. మరి ఈ ప్రయోగాత్మకమైన సినిమా ఫస్ట్ లుక్ ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందో చూడాలి.

‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ మూవీ రివ్యూ

చిత్రం : ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’

నటీనటులు: సప్తగిరి – కశిష్ వోరా – సాయికుమార్ – శివప్రసాద్ – షకలక శంకర్ -ఎల్బీ శ్రీరాం తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఛాయాగ్రహణం: సారంగం ఎస్.ఆర్
నిర్మాత: రవికిరణ్
రచన: పరుచూరి బ్రదర్స్
దర్శకత్వం: చరణ్ లక్కాకుల

గత కొన్నేళ్లలో కమెడియన్లు చాలామంది హీరోలుగా మారారు. గత ఏడాది ఆ కోవలోనే సప్తగిరి కూడా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’తో హీరో అవతారం ఎత్తాడు. ఇప్పుడతను ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హిందీ హిట్ సినిమా ‘జాలీ ఎల్ ఎల్ బీ’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఎల్ ఎల్ బీ పూర్తి చేసి తన ఊరి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సప్తగిరి (సప్తగిరి)కి అక్కడ వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలా కాదని హైదరాబాద్ వెళ్లి పెద్ద లాయర్ అయిపోదామని వస్తాడు సప్తగిరి. ఇక్కడ అతడి దృష్టిని అప్పటికే ముగిసిపోయిన ఒక కేసు ఆకర్షిస్తుంది. ఒక బడా బాబు తప్పతాగి రోడ్డు మీద నిద్రపోతున్న ఆరుగురిపై కారు ఎక్కించి వారి చావుకు కారణమైన కేసు అది. ఈ కేసును రాజ్ పాల్ (సాయికుమార్) అనే పెద్ద లాయర్ టేకప్ చేసి ఆ బడా బాబును బయటపడేస్తాడు. కోర్టు తీర్పు కూడా ఇచ్చేశాక ఈ కేసును తిరగదోడుతాడు సప్తగిరి. దీంతో అతడికి రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఆ ఇబ్బందుల్ని అతను ఎలా అధిగమించాడు.. ఈ కేసులో రాజ్ పాల్ మీద ఎలా విజయం సాధించాడు అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

ఇంతకుముందు బాలీవుడ్ నుంచి కోర్ట్ రూం డ్రామా నేపథ్యంలో సాగే ఒక కథను తీసుకొచ్చారు. అదే.. గోపాల గోపాల. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్.. వెంకటేష్ లాంటి పెద్ద స్టార్లున్నారు. కానీ వాళ్ల కోసం కథను కంగాళీ చేయలేదు. అవసరం లేని మసాలాలు అద్దలేదు. కమర్షియల్ అంశాల కోసం వెంపర్లాడలేదు. అంత పెద్ద స్టార్లు కథతో పాటే సాగిపోయారు. పాత్రలు తప్ప స్టార్లు కనిపించలేదు ఆ సినిమాలో. ఆ కథలో ఉన్న బలాన్ని.. దాని ప్రత్యేకతను అర్థం చేసుకుని.. కథే ప్రధానంగా సినిమాను నడిపించారు. అది కమర్షియల్ గా ఎంత మేర సక్సెస్ అయిందన్నది పక్కన పెడితే.. ‘ఓ మై గాడ్’ లాంటి మంచి కథను ‘గోపాల గోపాల’ టీం చెడగొట్టలేదన్నది మాత్రం వాస్తవం. ఒక అర్థవంతమైన ప్రయత్నంగా అనిపించిందా సినిమా.

ఐతే ఇప్పుడు హిందీ నుంచి మరో కోర్ట్ రూం డ్రామా స్టోరీని తెలుగులోకి తెచ్చారు. అదే.. జాలీ ఎల్ ఎల్ బీ. అప్పుడే ప్రాక్టీస్ ఆరంభించిన ఒక జూనియర్ లాయర్.. దేశంలోనే పేరు మోసిన ఒక బడా లాయర్ ను ఒక కేసులో ఢీకొట్టి.. మంచి వైపు నిలబడి న్యాయాన్ని గెలిపించే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. దీన్నే మన సప్తగిరి హీరోగా ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’గా తెరకెక్కించారు. ఇక్కడ ‘జాలీ ఎల్ ఎల్ బీ’ని ఎంతగా కిచిడీ చేయొచ్చో అంతగా చేసేశారు. ‘జాలీ ఎల్ ఎల్ బీ’ చాలా సున్నితంగా.. సైలెంటుగా.. కథే ప్రధానంగా సాగిపోయే సినిమా. కానీ తెలుగులోకి వచ్చేసరికి దానికి లెక్కకు మిక్కిలిగా కమర్షియల్ హంగులద్ది.. మోతాదుకు మించిన ‘లౌడ్’గా తయారు చేశారు. ఈ కమర్షియల్ హంగులు మెచ్చే వాళ్లకు ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ ఓకే అనిపించొచ్చు కానీ.. కథాకథనాల పరంగా మాత్రం ఇది నిరాశ పరుస్తుంది.

‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ ట్రైలర్ చూస్తేనే.. సినిమా ఎంత లౌడ్ గా ఉంటుందో.. ఇందులో సప్తగిరి విన్యాసాలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. సినిమాలో హైలైట్ అయిన అంశాలు కూడా అవే. మాతృకలో లాయర్ అయిన హీరో ఒక చోట డబ్బు కోసం ముసుగు వేసుకుని టెర్రరిస్టుగా నటించాల్సి ఉంటుంది. అందులో అతను ఊరికే ముసుగు తొడుక్కుని కొన్ని క్షణాలు ఇలా కనిపించి అలా మాయమవుతాడు. కానీ ఇక్కడ మాత్రం సప్తగిరి విన్యాసాలు మామూలుగా ఉండవు. దీన్ని ఒక పది నిమిషాల సన్నివేశంగా సాగదీశారు. ఇందులో ఉన్న గోల చూస్తేనే ‘జాలీ ఎల్ ఎల్ బీ’ ఎసెన్స్ తెలుగులో ఎంతమాత్రం ఉండదని అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి మొదలుపెడితే.. హీరో ఇంట్రడక్షన్ సాంగ్.. హీరోయిన్ తో ఫారిన్ లొకేషన్ లో డ్యూయెట్లు.. వీర లెవెల్లో ఫైట్లు.. లౌడ్ కామెడీ.. ఓవర్ డ్రమాటిక్ సీన్స్.. ఇలా మాతృకతో పోలిస్తే ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ రూటే వేరుగా ఉంటుంది.

‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ కొంచెం కుదురుగా.. ఏ డీవియేషన్లు లేకుండా.. కథతో పాటుగా సాగేది చివరి 20 నిమిషాల్లో మాత్రమే. కేసుకు సంబంధించిన మలుపులు.. కోర్టులో వాదోపవాదాలు.. డైలాగులు అన్నీ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కూడా కదిలిస్తాయి. కానీ అంతకుముందు వరకు సినిమా ఒక దశా దిశా లేకుండా సాగిపోతుంది. సీరియస్ గా కథ నడిచే చోట కామెడీ కోసం.. పాటలు.. ఫైట్ల కోసం వెంపర్లాడటంతో కథ ఎక్కడా ఒక తీరుగా సాగుతున్న భావన కలిగించదు. ఇందులోని కామెడీ పూర్తిగా మాస్ ప్రేక్షకుల్ని ఉద్దేశించిందే. కోర్టులో కేసు విచారణ సీరియస్ గా సాగుతున్నపుడు అపానవాయువు మీద జోకులు పేల్చడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. సింపుల్ సీన్లను కూడా చాలా లౌడ్ గా తయారు చేయడంతో సినిమా అంతా గోల గోలగా అనిపిస్తుంది.

కమర్షియల్ హంగులే అవసరమైనపుడు అందుకు తగ్గ కథనే ఎంచుకోవాల్సింది కానీ ‘జాలీ ఎల్ ఎల్ బీ’ లాంటి సీరియస్ కథను పట్టుకొచ్చి దాన్ని ఇలా కంగాళీగా తయారు చేయాల్సిన అవసరమైతే లేదు. మాతృకతో పోలికల సంగతి పక్కన పెట్టి మామూలుగా చూసినా.. ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ ఎక్కడా కుదురుగా.. ఆసక్తి రేకెత్తించేలా సాగదు. ఇందులోని అదనపు ఆకర్షణ వల్ల.. కథనం సాగే తీరు చాలా ‘లౌడ్’గా ఉండటం వల్ల కథ పలుచనైపోయింది. ఇలాంటి కథలకు ఇలాంటి నరేషన్ ఎంతమాత్రం నప్పదు. హీరోగా సప్తగిరి తొలి సినిమా నచ్చిన వాళ్లకైతే ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ కూడా నచ్చుతుంది. డ్యాన్సులు.. ఫైట్లు.. లౌడ్ కామెడీని ఇష్టపడేవాళ్లు ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ మీద ఓ లుక్కేసుకోవచ్చు.

నటీనటులు:

సప్తగిరి తన వరకు మంచి ఎనర్జీనే చూపించాడు. ఉత్సాహంగా నటించాడు. అతడికి అలవాటైన అమాయకపు నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్లలోనూ బాగానే చేశాడు. వీర లెవెల్లో డ్యాన్సులు చేశాడు. ఫైట్లూ చేశాడు. హీరోయిన్ కశిష్ వోరా గురించి మాత్రం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ అమ్మాయి ఏ రకంగానూ ఆకట్టుకోదు. కథానాయికకు ఎంత ప్రాధాన్యం లేకపోయినప్పటికీ.. సప్తగిరి పక్కన ఏమాత్రం సూటవ్వని.. డైలాగులకు.. పాటలకు సరిగా లిప్ సింక్ కూడా ఇవ్వలేని అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నారో? కీలకమైన పాత్రలో సాయికుమార్ రాణించాడు. కొన్నిచోట్ల ఆయన కూడా సినిమా టోన్ కు తగ్గట్లే కొంచెం అతిగా చేస్తున్న భావన కలుగుతుంది కానీ.. ఓవరాల్ గా ఆయన బాగానే చేశాడు. శివప్రసాద్ కూడా అంతే. షకలక శంకర్ మామూలే. ఎల్బీ శ్రీరాం ఓకే.

సాంకేతికవర్గం:

బుల్గానిన్ పాటలేమీ ప్రత్యేకంగా చెప్పుకునేలా లేవు. సప్తగిరి డ్యాన్సులేసుకోవడానికి తగ్గట్లుగా పాటలిచ్చాడు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సారంగం ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఓకే. సప్తగిరి రేంజికి మించి నిర్మాత బాగానే ఖర్చు పెట్టాడు. పాటల్ని స్టార్ హీరోల సినిమాల స్థాయిలో గ్రాండ్ గా.. రిచ్ లొకేషన్లలో తెరకెక్కించారు. పరుచూరి సోదరుల మాటల్లో ప్రత్యేకత ఏమీ కనిపించదు. కొన్ని మాటలు ఆలోచన రేకెత్తించేలా ఉన్నా.. అవి మాతృక నుంచి తీసుకున్నవే. దర్శకుడిగా చరణ్ లక్కాకుల ముద్రంటూ ఏమీ లేదు. అతను కొన్ని చోట్ల మాస్ కామెడీ పండించడంలో మాత్రమే తన ప్రతిభను చూపించాడు. మాతృకలోని ఆత్మను చరణ్ పట్టుకోలేదు. కథను మింగేసేలా కమర్షియల్ హంగులద్ది.. ‘సప్తగిరి ఎల్ ఎల్ బీ’ని చాలా లౌడ్ గా తయారు చేశాడు.

చివరగా: సప్తగిరి ఎల్ ఎల్ బీ.. మంచి కథకు మసాలా పులిమేశారు

రేటింగ్- 2/5

ఆక్సిజన్ మూవీ రివ్యూ

చిత్రం : ‘ఆక్సిజన్’
నటీనటులు: గోపీచంద్ – రాశి ఖన్నా – అను ఇమ్మాన్యుయెల్ – జగపతిబాబు – కిక్ శ్యామ్ – షాయాజి షిండే – ఆలీ – సితార – బ్రహ్మాజీ – అభిమన్యు సింగ్ – నాగినీడు – చంద్రమోహన్ – సుధ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు – వెట్రి
నిర్మాత: ఐశ్వర్య
స్క్రీన్ ప్లే: ఎ.ఎం.రత్నం
కథ – దర్శకత్వం: ఎ.ఎం.జ్యోతికృష్ణ

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కథానాయకుడు గోపీచంద్. అతడి కొత్త సినిమా ‘ఆక్సిజన్’ కూడా విడుదల విషయంలో చాలా ఇబ్బందులు పడింది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా.. ఎట్టకేలకు ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ రూపొందించిన ఈ సినిమా అయినా గోపీచంద్ కు ఆశించిన ఫలితాన్నిచ్చేలా ఉందా.. చూద్దాం పదండి.

కథ:

కృష్ణ ప్రసాద్ (గోపీచంద్) అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసే కుర్రాడు. అతను పెళ్లిచూపుల కోసం అతను ఇండియా వస్తాడు. ఓ పల్లెటూరిలో రఘుపతి అనే పెద్ద మనిషి కూతురైన శ్రుతితో అతడికి పెళ్లి నిశ్చయమవుతుంది. ఐతే ప్రసాద్ ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవడం శ్రుతికి ఇష్టం ఉండదు. ఈ పెళ్లి చెడగొట్టడానికి ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలించవు. ఇదిలా ఉంటే.. శ్రుతి కుటుంబం మొత్తాన్ని చంపేయాలని వారి శత్రువులు తిరుగుతుంటారు. వాళ్ల నుంచి కృష్ణప్రసాదే శ్రుతి కుటుంబాన్ని కాపాడతాడు. దీంతో శ్రుతికి అతను నచ్చేస్తాడు. అతడితో పెళ్లికి సిద్ధపడుతుంది. అంతా బాగుందనుకున్న తరుణంలో కృష్ణప్రసాద్ నిజ స్వరూపం శ్రుతికి తెలుస్తుంది. అతను వచ్చింది తనను పెళ్లి చేసుకోవడానికి కాదని.. తన కుటుంబాన్ని అంతం చేయడానికని ఆమెకు అర్థమవుతుంది. ఇంతకీ కృష్ణప్రసాద్ ఎవరు.. అతడి గతమేంటి.. శ్రుతి కుటుంబంపై అతడికున్న పగేంటి అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

హీరో.. అతడి టీం విలన్ల డెన్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక సీక్రెట్ రూం ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలంటే ఆరు అక్షరాల పాస్ వర్డ్ కొట్టాలి. మూడుసార్లు రాంగ్ పాస్ వర్డ్ కొడితే అది లాక్ అయిపోతుంది. అప్పుడు విలన్ల కుటుంబంలో సభ్యురాలైన కథానాయిక.. హీరోకు అదిరిపోయే హింట్ ఇస్తుంది. తన ఫ్యామిలీలో అందరూ జులైలోనే పుట్టారనేది ఆ హింట్. ఇక అంతే.. హీరోకు బల్బు వెలిగిపోతుంది. జులైలో పుట్టినోళ్లందరికీ ఒకటే రాశి ఉంటుందని.. ఆ రాశి కర్కాటకం అని.. దాన్ని ఇంగ్లిష్ లో ‘క్యాన్సర్’ అంటారని.. అది ఆరు అక్షరాలే అని.. దాన్నే పాస్ వర్డ్ అని డిసైడ్ అయిపోయి అక్కడ కొట్టేస్తాడు. సీక్రెట్ రూం ఓపెనైపోతుంది. ‘ఆక్సిజన్’ సినిమాలో కనిపించే చిత్రాతి చిత్రమైన సన్నివేశాల్లో ఇది ఒకటి. ఈ సినిమా ఎలా సాగుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.

సోషల్ కాజ్ ఉన్న కథాంశంతో సినిమా తీసినంత మాత్రాన జనాలందరికీ కనెక్టయిపోతుందనుకుంటే పొరబాటే. అలాంటి కథల్ని బలంగా.. జనాలకు హత్తుకునేలా చెప్పడం.. సందేశం మిళితం చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. ఈ విషయంలో ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తిగా ఫెయిలయ్యాడు. మంచి ఉద్దేశంతో.. సామాజిక అంశాల నేపథ్యంలో అతను కథను రాసుకోవడం వరకు ఓకే. కానీ ఆ కథను చెప్పిన తీరు మాత్రం పేలవం. కథగా చెప్పుకోవడానికి బాగానే అనిపించే ‘ఆక్సిజన్’.. సినిమాగా తేలిపోయింది. కథలోని కీలకమైన పాయింట్ ను ఎమోషనల్ గా కనెక్టయ్యేలా చెప్పడంలోనే జ్యోతికృష్ణ ఫెయిలయ్యాడు. దీనికి తోడు అనవసరమైన.. అర్థ రహితమైన సన్నివేశాలు.. కథతో సంబంధం లేని ఎపిసోడ్లు సినిమాను మరింతగా నీరుగార్చేశాయి.

‘పోకిరి’ సినిమాలో ట్విస్టు పేలిందని.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందని.. గత దశాబ్ద కాలంలో ఎన్ని సినిమాలు ఇలా ట్విస్టుల మీదే నడిచాయో లెక్కలేదు. ఐతే కథలో భాగంగా ట్విస్టు వస్తే ఓకే కానీ.. కేవలం ట్విస్టుల్నే నమ్ముకుని.. ఆ ట్విస్టుల చుట్టూనే కథల్ని నడిపిస్తే.. ఆ సినిమా ఎంత పేలవంగా తయారవుతుందనడానికి కూడా ‘ఆక్సిజన్’ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇందులో ఇంటర్వెల్ ముంగిట వచ్చే ట్విస్టు చూస్తే.. ఆ క్షణంలో షాక్ అవుతాం. కానీ సినిమా అంతా అయ్యాక ఆ ట్విస్టు గురించి ఆలోచిస్తే.. దాని కంటే ముందు వచ్చిన కథనమంతా చూసుకుంటే అర్థ రహితంగా అనిపిస్తుంది. ఈ ట్విస్టు వచ్చాక ప్రేక్షకుడు థ్రిల్ అయిపోతాడు కాబట్టి.. అంతకుముందు వరకు ఏం చూపించినా పర్వాలేదు అన్నట్లుగా తయారైంది వ్యవహారం. ప్రథమార్ధంలో గంట పాటు హీరోయిన్ పెళ్లిచూపులు.. ఆమె పెళ్లిచూపులు చెడగొట్టుకోవడానికి చేసే ప్రయత్నాల చుట్టూ నడిచిన కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక్కడే ‘ఆక్సిజన్’ ఫలితమేంటో తెలిసిపోతుంది.

ఇంటర్వెల్ ట్విస్టు తర్వాత అనుకున్నట్లే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అందులో ఏ ప్రత్యేకతా లేదు. ఓవర్ డోస్ సెంటిమెంటుతో చాలా రొటీన్ గా సాగిపోతుంది ఆ ఫ్లాష్ బ్యాక్. అదే లెంగ్తీ అయిందనుకుంటే.. ఇక ఆ తర్వాత క్లైమాక్స్ వరకు సాగదీసిన తీరు మరింతగా విసిగిస్తుంది. ఒక పల్లెటూరిలో మామూలుగా జీవనం సాగించే ఒక కుటుంబం.. ఎవరికి తెలియకుండా ఒక డ్రగ్ రాకెంట్ ను నడిపించడం.. వేల కోట్లు ఆర్జించడం అనే పాయింటే చాలా అసహజంగా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ అంతటినీ డీల్ చేసిన విధానం కూడా ఈ అసహజత్వాన్ని మరింత పెంచేలా ఉంది. ఒక దశ దాటాక సినిమా సాగుతున్న తీరు చూస్తే.. ఇటు నటీనటులకు.. అటు సాంకేతిక నిపుణులకు దీనిపై పూర్తిగా నమ్మకం పోయిందేమో.. ఎవరూ ఏమాత్రం ఆసక్తి లేకుండా పని చేశారేమో అనిపిస్తుంది. ఎండ్ టైటిల్స్ పడే సమయానికి.. ఒకసారి ప్రథమార్ధాన్ని గుర్తు చేసుకుంటే.. రెండు వేర్వేరు సినిమాలు చూసిన భావన కలుగుతుంది. ఎన్నడూ లేని విధంగా గోపీచంద్ కు కొన్ని సన్నివేశాల్లో ఎవరో డబ్బింగ్ చెప్పడాన్ని బట్టి ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టే ‘ఆక్సిజన్’ ఎందుకింత ఆలస్యమైందో.. ఈ సినిమా విషయంలో గోపీచంద్ ఎందుకంత నిరాసక్తంగా కనిపించాడన్నది కూడా అర్థమైపోతుంది.

నటీనటులు:

గోపీచంద్ కొత్తగా ఏమీ చేసింది లేదు. తనకు అలవాటైన రీతిలోనే కనిపించాడు. నటన పరంగా కొత్తగా చేయడానికేమీ లేకపోయింది ఈ సినిమాలో. అతడి లుక్ మాత్రం బాగుంది. ఇంటర్వెల్ దగ్గర.. ద్వితీయార్దంలో మాస్ ప్రేక్షకుల్ని అలరించేలా కనిపించాడు గోపీ. హీరోయిన్లు రాశి ఖన్నా.. అను ఇమ్మాన్యుయెల్.. ఇద్దరూ తేలిపోయారు. ముఖ్యంగా అను ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు ఈ సినిమాలో. రెండేళ్ల ముందు నటించడం వల్లో ఏమో.. చిన్న పిల్లలా అనిపించింది. గోపీచంద్ పక్కన అసలేమాత్రం సెట్టవ్వలేదు. రాశి ఖన్నా కూడా చేసిందేమీ లేదు. జగపతిబాబుది పేలవమైన పాత్ర. చివర్లో లుక్ మార్చి షాకిచ్చే ప్రయత్నం చేశాడు. అది ఫలించలేదు. కిక్ శ్యామ్.. అభిమన్యు సింగ్.. శ్రవణ్.. బ్రహ్మాజీ.. నాగినీడు.. ఇలా చెప్పుకోవడానికి చాలా పెద్ద తారాగణమే ఉంది కానీ.. ఎవరికీ సరైన పాత్రల్లేవు. ఆలీ కామెడీ కూడా పెద్దగా నవ్వించలేదు.

సాంకేతికవర్గం:

యువన్ శంకర్ రాజా ఇంతకుముందు తెలుగులో మంచి అభిరుచి ఉన్న సినిమాలు చేశాడు. అందులో అతడి సంగీతం విని ఫిదా అయిన వాళ్లకు ‘ఆక్సిజన్’ పెద్ద షాకిస్తుంది. ఈ సినిమాకు నిజంగా అతనే పని చేశాడా అన్న సందేహాలు కలుగుతాయి. పాటలు కానీ.. నేపథ్య సంగీతం కానీ.. ఎంతమాత్రం యువన్ స్థాయికి తగ్గట్లు లేవు. పాటల్లో ఒక్కటి కూడా గుర్తుంచుకునేలా లేదు. ఈ సినిమాకు ఆరుగురు ఛాయాగ్రాహకులు పని చేసినట్లుగా చెప్పాడు దర్శకుడు. కానీ ఎవరూ మనసు పెట్టి చేసినట్లు లేరు. సినిమా లుక్ రకరకాలుగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. దర్శకుడు జ్యోతికృష్ణ ఎంచుకున్న కథ వరకు పర్వాలేదు. కానీ దాన్ని చాలా పేలవంగా.. అపరిపక్వంగా తెరకెక్కించాడు. ఈ కథలో కొంతవరకు ‘రామయ్యా వస్తావయ్యా’ ఛాయలు కూడా కనిపిస్తాయి. ఎ.ఎం.రత్నం స్క్రీన్ ప్లేలోనూ ఏ విశేషం లేదు. పదేళ్లకు పైగా విరామం తర్వాత మెగా ఫోన్ పట్టిన జ్యోతికృష్ణ ఔట్ డేట్ అయిపోయాడనిపిస్తుంది సినిమా చూస్తుంటే.

చివరగా: ఆక్సిజన్.. ఊపిరాడనివ్వదు!

రేటింగ్- 1.5/5